సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (09:56 IST)

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో గుబులు.. భార్యలు మినహా ప్రతిదీ పందెంగా పెట్టేస్తున్నారు...

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పోల్స్ రిజల్ట్స్ పుణ్యమాన్ని బెట్టింగ్‌ల జోరు ఒక్కసారిగా పెరిగిపోయింది. పందెం రాయుళ్లలో గుబులు మొదలైంది. దీంతో తొలుత కాచిన పందానికి రివర్స్‌లో పందెం కాస్తున్నారు. ఇందుకోసం నగదుతో పాటు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, మాగాటి, చేపల చెవురు, మెట్ట పొలాలు, కారు, వాచీలు, మొబైల్ ఫోన్లు, లగ్జరీ కార్లు, ఇలా తమ వద్ద ఏది ఉంటేదాన్ని పందంగా పెడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ భార్యలను మినహా మిగిలిన ప్రతిదాన్ని పందెం కింద పెడుతున్నారు. 
 
దేశంలో మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వీటితోపాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన తొలిదశ పోలింగ్‌ మే 19వ తేదీన జరిగిన చివరి దశ పోలింగ్‌తో ముగిసింది. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. పోలింగ్‌ రోజుకు వారం రోజులు ముందు తరువాత కూడా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ విజయాలపై పందాలు కట్టారు. పార్టీలపై అభిమానంతో కొంతమంది పందాలు కడితే పందెం రాయుళ్ళు మాత్రం లెక్కల ప్రకారం ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసి తమ బెట్టింగ్‌లు వేశారు. అయితే తాజాగా విడుదలై ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు గందరగోళం సృష్టించాయి. 
 
పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ తర్వాత రెండు రోజులు పాటు పందాలు కట్టిన కొంత మంది పందెం రాయుళ్ళు రివర్స్‌గేర్‌ వేశారు. ఓటర్ల నాడి పసిగట్టడంలో అటు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో స్పష్టత లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో అంతకముందు ఒక పార్టీకి వేసిన పందెం అదే పార్టీకి వ్యతిరేకంగా వేరొకరితో పందెం కట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా చేస్తే ఏ పార్టీ విజయం సాధించినా తమ సొమ్ములు మాత్రం ఎటూ పోవనే భావనతో కొత్తపందాల కోసం అన్వేషిస్తున్నారు.