రెడ్లు అత్యాచారాలు చేస్తే ఎన్‌కౌంటర్లు చేయించగలరా?: మందకృష్ణ

mandha krishna madiga
ఎం| Last Updated: శనివారం, 14 డిశెంబరు 2019 (14:34 IST)
దళితులు, గిరిజనులపై రెడ్లు అత్యాచారాలు చేస్తే..జగన్‌, కేసీఆర్‌ ఎన్‌కౌంటర్లు చేయించగలరా? అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదన్నారు. హాజీపూర్‌ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డిని ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయలేదు? అని ప్రశ్నించారు.

జడ్చర్లలో బాలికను హత్య చేసిన నవీన్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయమని కేసీఆర్‌కు జగన్‌ చెప్పగలడా? అని ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యాచార నిందితులకు ఏ శిక్ష వేస్తారో అసెంబ్లీలో జగన్‌ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ వేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. త్రిసభ్య కమిషన్‌ద్వారా అట్టడుగు పేదవర్గాలకు న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి ప్రత్యేకంగా కనిపించిన పోలీసులు సమాజం ముందు కనిపించే పాత్రదారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని ఆరోపించారు.

కమిషన్‌ విచారణతో ఈ రెండు రకాల శక్తులు పాత్ర బయటపడుతుందని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు నిరసనగా ఈనెల 24న ఇందిరాపార్కులో తలపెట్టిన మహాదీక్షను విజయవంతం చేయాలని కోరారు.
దీనిపై మరింత చదవండి :