టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారుతోంది. అయితే, ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేరని, ముష్కరులను అడ్డుకోలేదనేది టీడీపీ నాయకుల వాదనగా ఉంది. ఇది సరికాదని, పోలీసులు ముష్కర మూకను చెల్లాచెదురు చేశారని చెపుతున్నారు. దీనికి సీసీ ఫుటేజే ఆధారమని పేర్కొంటున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం ముష్కరులను సమర్ధవంతంగా తరిమి వేసిన నార్త్ సబ్ డివిజన్ డి ఎస్ పి రాంబాబు, రూరల్ సిఐ వి భూషణం, సిబ్బంది తాము ఆ సమయంలో కీలకంగా వ్యవహరించామని చెపుతున్నారు. దాడిలో పాల్గొన్న వారిలో ఒక్కరిని చాకచక్యంగా పట్టుకొని విచారిస్తే, దాడి కి మూలాలు, పాత్రలు, పాత్రధారులెవరో దొరికేవారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే,
ముష్కరుల దాడి సందర్భంలో అడ్డుకునే ప్రయత్నంలో రూరల్ సిఐ వి భూషణంపై దాడికి యత్నించిన దుండగులు ఎవరో గుర్తిస్తున్నారు. కర్రతో కొట్టే సందర్భంలో చేతిని అడ్డుపెట్టిన ఓ రూరల్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే, దాడి చేసిన వారిని గుర్తించి పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటారా? లేక టీడీపీ వారిపైనే ఉల్టా కేసులు మోపుతారా అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల నుండి వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారంలో సీసీ పుటేజ్ లు కీలకం కానున్నాయి.