జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మరో ఐదేళ్ల పాటు సీఎంగా జగన్ : హరిరామజోగయ్య
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, గతంలో కంటే ఇపుడు జనసేన బలం ఎంతగానో పెరిగిందన్నారు. బీజేపీతో కలిసి జనసేన పార్టీ కలిస్తే ప్రధాని మోడీ ఛరిష్మా తోడయి బలం చేకూరుతుందని చెప్పారు. టీడీపీ కూడా కలిస్తే వైకాపా ఓటమి మరింత సులువు అవుతుందని ఆయన చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జనసేనతో టీడీపీ కలిస్తే ఇక వైకాపా ఓటమి మరింత సులువు అవుతుందన్నారు. జనసేన బలం గతంలో కంటే పెరిగిందని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసేందుకు పవన్ పార్టీ భయపడాల్సిన పని లేదన్నారు. ప్రతిపక్షాల ఓటు చీలకుండా చూసుకుంటే వైకాపా ఓడించవచ్చని చెప్పారు.
టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేయడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డుగా ఉందని, సీఎం ఎవరు కావాలనే ప్రశ్న ఎదురవుతుందని చెప్పారు. చంద్రబాబు మెట్టు దిగివచ్చి, అధికారంలోకి వచ్చాక చెరో సగకాలం ముఖ్యమంత్రి పదవిని ఎంచుకోవాలని, ఇపుడు ఇరు పార్టీల కార్యకర్తలు సంతృప్తి చెందుతారని చెప్పారు.