జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన ఏపీ పోలీస్ కి సీఎం అభినందన
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్ శాఖను సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్పూర్తిగా అభినందించారు. ఇలాగే ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి, ఈ ప్రస్ధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు, స్మార్ట్ పోలీసింగ్ సర్వే రిపోర్ట్‌ను సీఎంకి అందజేసి వివరాలు వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్ వచ్చినట్లు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడించిందని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్, తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో సర్వే చేసింది.
2014 డీజీపీల సదస్సులో స్మార్ట్ పోలీసింగ్ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే చేసింది. ఏడేళ్ళుగా నిర్వహిస్తున్న సర్వేలో తొలిసారిగా మొదటి ర్యాంకును ఏపీ పోలీస్ శాఖ సాధించిందని డీజీపీ వివరించారు. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్ సర్వే నిర్వహించిందని, ఐపిఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులుంటారని తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ద, పారదర్శక పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్ వన్ సాధించిందని వివరించారు. పోలీస్ సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీస్ వ్యవస్ధ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకింగ్ లభించిందని తెలిపారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ (బెటాలియన్స్) శంకబ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పాల్గొన్నారు.