సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (07:28 IST)

దేవుని దయతో అవ్వ - తాత ఆశీర్వదించడం వల్లే ఈ గొప్ప విజయం : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా అత్యంత ఘనమైన రీతిలో విజయం సాధించింది. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ఈ గొప్ప విజయం ప్రజలందరిదని వినమ్రంగా పేర్కొన్నారు. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, ప్రతి తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని తెలిపారు.  
 
ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను ఈ విజయం మరింత పెంచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంకా మంచి చేసేందుకు మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కచెల్లెమ్మకు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
 
ఇదిలావుంటే, ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందుకుంది. వెల్లడైన అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్‌గాలి వీచింది. మున్సిపాలిటీల్లోనూ తాడిపత్రి, మైదుకూరు మినహా అన్ని చోట్లా అధికార పార్టీకే ప్రజలు పట్టంకట్టారు. 
 
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో తెదేపా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని భావించినా నామమాత్ర స్థానాలనే ఆ పార్టీ దక్కించుకుంది. జనసేన, భాజపా ప్రభావం కనిపించలేదు. మొత్తం 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థల్లో ఫలితాలను వెల్లడించలేదు.
 
ఓట్ల లెక్కింపు జరిగిన 11 నగరపాలక సంస్థలూ వైకాపా వశమయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప కార్పొరేషన్లలో ఆ పార్టీ విజయ ఢంకా మోగించింది. దాదాపు అన్ని చోట్లా తెదేపా-వైకాపా మధ్య సీట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఒక్క విశాఖపట్నంలో మాత్రం 30 స్థానాల్లో తెదేపా గెలుపొందడం ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే అంశం.
 
కార్పొరేషన్ల వారీగా ఫలితాలను పరిశీలిస్తే..
 
విజయనగరం ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా 42 చోట్ల వైకాపా, ఒక చోట తెదేపా, ఒకస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
 
విశాఖపట్నం గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో 98 డివిజన్లు ఉండగా వైకాపా 58 చోట్ల, తెదేపా 30 స్థానాల్లో గెలుపొందాయి. జనసేన 4, భాజపా 1, సీపీఎం 1, సీపీఐ 1, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
 
మచిలీపట్నం ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో వైకాపా 43, తెదేపా 5, జనసేన ఒకచోట గెలుపొందాయి. 
 
విజయవాడ: ఈ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉండగా.. వైకాపా 49, తెదేపా 14, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. 
 
గుంటూరు మొత్తం 57 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే ఒకస్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 56 స్థానాల్లో వైకాపా 43, తెదేపా 9, జనసేన 2, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఏకగ్రీవమైన అభ్యర్థి కూడా వైకాపాకు చెందిన వ్యక్తే కావడంతో గుంటూరు నగరపాలికలో ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 44.
 
ఒంగోలు ఇక్కడ ఉన్న 50 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. 
 
చిత్తూరు ఈ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో వైకాపా 46, తెదేపా 3, ఇతరులు 1 చోట విజయం సాధించారు
 
తిరుపతి ఇక్కడ మొత్తం 49 డివిజన్లు ఉండగా వైకాపా 48చోట్ల, తెదేపా 1చోట గెలిచాయి.
 
అనంతపురం మొత్తం 50 డివిజన్లలో వైకాపా, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. 
 
కడప ఈ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. దీనిలో వైకాపా 48, తెదేపా 1, ఇతరులు 1 చోట విజయం సాధించారు.
 
కర్నూలు మొత్తం 52 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 8, స్వతంత్రులు 3 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.