బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (17:50 IST)

ఏపీలో జగనన్న విద్యా కానుకలో ఇచ్చేవి ఏంటి?

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో జగనన్న విద్యా కానుక ఒకటి. ఈ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం కీలక ఆదేశాలు జారీచేశారు. విద్యారంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం కలిగినదని, ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. 
 
ఈ పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలో నోట్‌ బుక్స్, షూ, బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌‌తో పాటు ఇంగ్లిష్-తెలుగు డిక్షనరీ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 
 
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 47.32 లక్షల మందికిపైగా విద్యార్ధులకు 2021-22 విద్యా సంవత్సరానికి రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 
 
'జగనన్న గోరుముద్ద' పథకం కోసం 2021–22లో రూ.1,625 కోట్లు, మనబడి ‘నాడు–నేడు’ రెండో విడత కోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
 
విద్యారంగంతో పాటు వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, స్టీల్‌ప్లాంట్‌ తదితరాలను కూడా సీఎం జగన్‌ సమీక్షించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
ఉద్దానం, పులివెందుల, డోన్‌ వాటర్‌ గ్రిడ్‌ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్మాణంపై మరింతగా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టి పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.