శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (09:23 IST)

నీట్ ఫలితాల్లో మెరిసిన తెలుగోళ్లు : జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకు

జాతీయస్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులతో సత్తా చాటారు. 
 
ఆలిండియా టాప్‌ 20 ర్యాంకర్లలో తెలంగాణ, ఏపీ నుంచి ఇద్దరేసి చొప్పున చోటు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన మృణాల్‌ కుట్టేరి జాతీయ స్థాయిలో ఒకటో ర్యాంకుతో టాపర్‌గా నిలిచాడు. నగరానికే చెందిన మరో విద్యార్థి ఖండవల్లి శశాంక్‌ ఆలిండియా 5వ ర్యాంకు సాధించాడు.
 
ఇకపోతే, ఖమ్మంకు చెందిన పెంటేల కార్తీక్‌ 53వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తెలంగాణ అమ్మాయిలు నీట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు. అమ్మాయిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... టాప్‌ 20 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు ఉండటం విశేషం. 
 
కాసా లహరి ఆలిండియా 30వ ర్యాంకుతో సత్తా చాటింది. ఈమని శ్రీనిజ 38వ ర్యాంకు, శ్రీనిహారిక 56వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుపునూరి శరణ్య 60వ ర్యాంకుతో జయకేతనం ఎగరవేశారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల్లో విజయవాడకు చెందిన చందం విష్ణు వివేక్‌, గొర్రిపాటి రుషీల్‌ 5వ ర్యాంకుతో మెరిశారు. పీవీ కౌశిక్‌ రెడ్డి 23వ ర్యాంకు సాధించాడు. కౌశిక్‌ రెడ్డి కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత కుమారుడు కావడం విశేషం. 
 
అబ్బాయిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... టాప్‌ 20 ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు సాధించారు. తెలంగాణ నుంచి మృణాల్‌, శశాంక్‌, ఏపీ నుంచి విష్ణు వివేక్‌, రుషీల్‌, పీవీ కౌశిక్‌ రెడ్డి టాప్‌ 20లో ఉన్నారు.