ఏపీ మంత్రివర్గం వాయిదా : కడపలో మూడు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదాపడింది. సెప్టెంబరు ఒకటో తేదీన జరగాల్సిన ఈ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం లేకపోలేదు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. దీంతో ఒకటో తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఏడో తేదీకి వాయిదా వేశారు.
కడప పర్యటన కోసం సీఎం జగన్ సెప్టెంబరు ఒకటో తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయ కాంప్లక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
2వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ వర్థంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ పిమ్మట అక్కడే ఉన్న ప్రార్థనా మందిరంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. సాయంత్రం వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. రాత్రికి మళ్లీ ఇడుపులపాయకు చేరుకుని అక్కడే బస చేస్తారు. మూడో తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుుకుంటారు.