సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (22:51 IST)

భూముల రీసర్వేపై హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో సమన్వయ సమావేశం

image
రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వీరు విభిన్న అంశాలను చర్చించారు. 

 
ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి దాదాపు 12 మంది నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ నేతృత్వం వహించగా, జియో స్పేషియల్ డేటా సెంటర్ డైరెక్టర్ ఎస్వి సింగ్ తన బృందంతో పాల్గొన్నారు. డేటా సెంటర్‌కు సంచాలకులుగా సింగ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలను లోతుగా చర్చించారు. ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అంశాలు, ఇకపై చేయవలసిన కార్యక్రమాలు, కాలపరిమితి వంటి అంశాలపై సమావేశం సాగింది.

 
రాష్ట్రానికి చెందిన భూసర్వే ప్రాజెక్టులో సర్వే ఆఫ్ ఇండియా కీలక భూమికను పోషిస్తుండగా, నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేందుకు ఎదురవుతున్న అడ్డంకులను అధికమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ సమావేశం చర్చించింది. సర్వే ఫలాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసే క్రమంలో ఎదురవుతున్న క్షేత్ర స్దాయి సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు.

 
దశాబ్దాలుగా ఏ ఒక్కరూ ప్రయత్నించని రీసర్వే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న తరుణంలో మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, మరిన్ని శిక్షణలు ఇవ్వవలసిన అవశ్యకత తదితర అంశాలు కూడా ఈ చర్చలో భాగం అయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించిన గ్రామాలలో పనులు వేగవంతం కావలసిన ఆవశ్యకతపై పలు సూచనలు వచ్చాయి. సమావేశంలో సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ కార్యాలయం నుండి సంయిక్త సంచాలకులు ప్రభాకర రావు, రాష్ట్ర సర్వే శిక్షణా అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ కుమార్, ప్రత్యేక అధికారి అజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.