1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (18:01 IST)

ఏపీలో కొత్తగా 2వేల కేసులు.. కర్ఫ్యూ నిబంధనలు సడలింపు

ఏపీలో కొత్తగా 2వేల 224 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 31 మంది మృతి చెందారు. ఏపీలో పాజిటివ్‌ కేసులు 18 లక్షల 79 వేల 201కి చేరాయి. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 12వేల630 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 18లక్షల 24వేల 319 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 42వేల 252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
ఏపీలో కేసులు కంట్రోల్‌ అవుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31 మంది కరోనా కాటుకు బలయ్యారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా పేషెంట్లు చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
 
మరోవైపు ఏపీలో కరోనా కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది.
 
ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోకున్నారు.