శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:51 IST)

అనంతపురం జిల్లాలో తహసీల్దారుకు కరోనా.. నేతల్లో వణుకు!

కరోనా విధుల్లో నిమగ్నమైవున్న ఓ తహసీల్దారుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో కలిసి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ ఘటన అనంతపుర జిల్లా మడకశిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌ గత కొన్ని రోజులుగా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపుడున్నాడు. దీంతో ఆయనకు పరీక్షలు చేయగా, వాటిలో కరోనా పాజిటివ్ అని తేలింది. తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులు, రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. 
 
ఈ తహసీల్దార్ మడకశిర ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారు. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.
 
ఇదిలావుండగా, ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఏపీలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటిరకూ 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 15 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.