సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (16:27 IST)

జగనన్న అడ్డాగా... ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరు మార్చేయండి!

ఏపీలో మత చిచ్చు రేపి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం అటువంటి మతోన్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించి, అవసరమైతే వారిపై గూండా యాక్ట్ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో మసీదు నిర్మాణం విషయంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టిన చర్యలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
 
 
విజయవాడ దాసరి భ‌వన్లో రామ‌కృష్ణ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలు ఒక ప‌క్క మత విద్వేషాలు రేపుతూ, మరో పక్క మేమేం చేసినా కేసులు కూడా పెట్టకూడదన్న ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్నిబ్లాక్ బెయిల్ చేస్తున్నార‌ని చెప్పారు. గతంలో సోము వీర్రాజు కూడా గుంటూరులోని జిన్నా టవర్, వైజాగ్లో కేజీహెచ్ పేరు మార్చాలంటూ వివాదం రేపార‌ని, చివరకు ముఖ్యమంత్రిపై సైతం క్రిస్టియన్ ముద్ర వేసి దుష్ప్రచారం చేశార‌న్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మతోన్మాదం రెచ్చగొట్టే చర్యలు చేపట్టడమే బీజేపీ నేతలు ప్రధాన అజెండాగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నా దానిపై మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు విప్పడం లేదన్నారు. కనీసం రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క సమస్యపై అయినా కేంద్ర మంత్రిని కలవడం కాని, కనీసం అర్జీ ఇవ్వడం కానీ చేశారా? అని రాష్ట్ర బీజేపీ నేతలను రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. 
 
 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేసి, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ప్రకటించిన ఐఆర్ 27శాతం కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందన్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు విషయంలో గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ఫిట్మెంట్ కనీసం 27 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు..
 
 
జగనన్న స్మార్ట్ సిటీల పేరుతో ప్రభుత్వం బహిరంగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అవతారమెత్తిందని  రామకృష్ణ దుయ్యబట్టారు. ఇప్పటివరకు జగనన్న కాలనీలు అంటూ ప్రచారం చేసుకున్న ప్రభుత్వం,  మోడల్ హౌస్ కట్టడం తప్ప, రాష్ట్రంలో ఒక్క కాలనీ కూడా కట్టలేదన్నారు. అలాగే గత రెండున్నరేళ్లుగా నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లు సైతం లబ్దిదారులకు అందజేయలేదన్నారు. ఆ పధకాలను పూర్తి చేయకుండానే, వాటిని ప్రక్కనబెట్టి ఇప్పుడు స్మార్ట్ సిటీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని నవులూరు వెంచర్లో ప్లాట్లు అధిక రేట్లకు అమ్ముకోవడం కోసం దగ్గరలో సెక్రటేరియట్, హైకోర్టు ఉన్నాయని ప్రచారం చేయడమే దీనికి నిదర్శనమన్నారు. గతంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని, హైకోర్టు కర్నూలుకి, సెక్రటేరియట్ వైజాగ్ వెళుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని బట్టి ముఖ్యమంత్రి పూర్తి గందరగోళంలో ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. 
 
 
అన్నింటికీ మించి ప్రతి పథకానికి జగనన్న పేరు పెట్టడం ప్రజలకు వెగటు పుట్టిస్తోందన్నారు. మీరేమైనా స్వాతంత్య్ర సమరయోధులా? రాష్ట్రం కోసం, దేశం కోసం ఏమైనా త్యాగం చేశారా? లేకుంటే మీ సొంత డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ప్రజల సొమ్ముతో అమలు చేసే పథకాలకు మీ పేరు ఎలా పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ పథకాలకు, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు జగనన్న కాలనీలుగా పేర్లు పెట్టుకునే బదులు, ఆంధ్రప్రదేశ్ అనే పేరు స్థానంలో 'జగనన్న అడ్డా' అని పేరు మారిస్తే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు.


ఇంత పనికిమాలిన నిర్ణయాలపై కూడా ఆపార్టీలో మంత్రులు, నాయకులు కనీసం వారి అభిప్రాయం చెప్పలేని వాజమ్మలుగా మారడం, అధికారులు అంతకంటే దారుణంగా తయారవ్వడం విచారకరమన్నారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథరెడ్డి, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.