శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (18:37 IST)

ఆ అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెప్తుంది?: ధర్మాన

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూహైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ ప్రారంభ‌మైంది. 
 
ఈ చ‌ర్చ‌ను ప్రారంభించిన ధ‌ర్మాన మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 
 
హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని చెప్పారు. దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. 
 
ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని ధర్మాన అభిప్రాయ‌ప‌డ్డారు. చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న జాతీయ స్థాయిలో పార్ల‌మెంటుకు, రాష్ట్ర స్థాయిలో శాస‌న‌స‌భ‌కు మాత్ర‌మే ఉన్నాయ‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. 
 
ఈ అధికారం మ‌రే ఇత‌ర వ్య‌వ‌స్థ‌కు లేద‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకమైన సందర్భంలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చన్నారు. 
 
ప్రభుత్వం మారితే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెబుతుందని ధ‌ర్మాన‌ ప్రశ్నించారు. ఆ అధికారం లేదని కోర్టులు చెప్తే ఏం చేయాలని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.