బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:35 IST)

డిసెంబర్‌ 25న ఏపీవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు తేదీ ఖరారు చేసింది. కరోనా లాక్‌డౌన్‌, కోర్టు కేసులతో ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో డిసెంబర్‌ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమాన్ని తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కా్య‌క్ర‌మానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, డీజీపీ గౌతం సవాంగ్,  వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టాల పంపిణీ ప్రారంభించిన రోజే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.

తొలిదశలో దాదాపు 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడింది. ఉగాది సందర్భంగా తొలిసారి ఈ ఏడాది మార్చి 7న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

ఆ తర్వాత ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి రోజు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ కోర్టులో కేసులు, కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది.

జులై 8న వైఎస్‌ఆర్‌ జయంతి, ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సతవం సందర్భంగా ఆగస్టు 15, గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావించినా కోర్టు కేసులు వల్ల సాధ్యం కాలేదు. దీంతో కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.