నిజంగానే పిచ్చోడిని చేస్తున్నారు.. హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

dr sudhakar
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 29 మే 2020 (10:42 IST)
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననీ, కానీ నిజంగానే తనను పిచ్చోడిని చేసేందుకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన డాక్టర్ సుధాకర్ ఇపుడు హైకోర్టును ఆశ్రయించారు. తాను చికిత్స పొందుతున్న మానసిక రోగుల చికిత్సాలయం నుంచి మరో ఆస్పత్రికి మార్చాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిజానికి తనను మరో ఆస్పత్రికి మార్చాలంటూ ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఓ లేఖ రాశారు. ఇందులో తనకు వాడుతున్న మందుల వివరాలను కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయంచారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు.

తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మానసిక రోగులకు ఇచ్చే మందులు బలవంతంగా ఇస్తున్నారని, వాటి వల్ల తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు డాక్టర్ సుధాకర్ కేసును విచారించే బాధ్యతను విశాఖ సీబీఐకి అప్పగిస్తూ సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో విశాఖ అధికారులు ఒకటి రెండు రోజుల్లో కేసు విచారణను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

కాగా, నర్సీపట్నం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియ వైద్యుడిగా పని చేస్తూ వచ్చిన డాక్టర్ సుధాకర్.. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఇచ్చే ఎన్95 రకం మాస్కులు, పీపీఈ కిట్లను ప్రభుత్వం సరఫరా చేయలేదని మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్టణం పోలీసులు ఈ వైద్యుడు పట్ల అమానుషంగా ప్రవర్తించగా, పోలీసు చర్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు పూర్తి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.దీనిపై మరింత చదవండి :