సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (19:48 IST)

మహాపచారం... దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం!! (video)

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఎక్కువైపోతోంది. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి. అంతర్వేది ఆలయ రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తలగబెట్టారు. ఇపుడు పవిత్ర కనకదుర్గ అమ్మవారి ఆలయం పాలక మండలి సభ్యురాలికి చెందిన కారులో అక్రమ మద్యం రవాణా జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సభ్యురాలు తన పదవికి రాజీనామా చేశారు. 
 
విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలిగ నాగవరలక్ష్మి ఉన్నారు. బుధవారం ఈమె కారులో మద్యం అక్రమ రవాణా జరిగిందని వార్తలు వచ్చాయి. దీంతో జగ్గయ్యపేటలో ఆ వాహనాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే వరలక్ష్మి కుమారుడు సూర్యప్రకాశ్‌ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు, డ్రైవర్‌ శివను అరెస్ట్‌ చేశారు. 
 
అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమె పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణాపై విచారణ ముగిసే వరకూ నైతికబాధ్యత వహించి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వరలక్ష్మి ఆలయ ఈవోకు, పాలకమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. మరోవైపు నాగవరలక్ష్మి రాజీనామాను ఆమోదించినట్లు దుర్గగుడి ఛైర్మన్‌ తెలిపారు.