గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 12 జూన్ 2021 (21:38 IST)

శ్రీవారి భక్తులకు సులభంగా గదులు, ప్రారంభించిన అదనపు ఈఓ...

తిరుమలలో భక్తులకు ఇక గదులు దొరకడం చాలా ఈజీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోందని టిటిడి అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. 
 
తిరుమలలోని సిఆర్ఓ వద్ద అదనపు ఈఓ పూజలు  నిర్వహించి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తిరుమలలో వసతి కొరకు సిఆర్ఓ వద్ద భక్తులకు పేర్లు రిజిస్ట్రేషన్లు మరియు గదులు కేటాయిస్తున్నారన్నారు. 
 
సిఆర్ఓ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కావున భక్తులకు మరింత త్వరితగతిన పేర్లు నమోదు, గదుల కేటాయింపు కొరకు తిరుమలలోని వివిధ ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 
ఇందులో భాగంగా సిఆర్ఓ వద్ద రెండు కౌంటర్లు బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచా బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జిఎన్ సి టోల్ గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ నందు రెండు కౌంటర్లలో భక్తులు వసతి కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 
 
పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు ఎస్ ఎంఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేయబడుతుందని చెప్పారు. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.