అప్పన్న దేవస్థానంలో ఇంటి దొంగల చేతివాటం!!
వైజాగ్ జిల్లాలోని సింహాచలం శ్రీ అప్పన్న దేవస్థానంలో ఇంటి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. అప్పన్న స్వామికి చెందిన వెండి కానుకలు మాయంలో ఆలయ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలింది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో ఉంచిన దాదాపు 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు ఇటీవల గుర్తించారు. దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న ఇత్తడి కానుకల మాయంపై విశాఖపట్టణం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ చేపట్టారు. ఇందులో ఇంటి దొంగలే ఈ పనికి పాల్పడినట్టు తేలింది. సింహాచలంలో నివసించే ఔట్ సోర్సింగ్ మాజీ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్‌లను అనుమానించి విచారించగా విషయం బయటపడింది.
ఆలయ వ్యర్థాల్లో కలిపి ఇత్తడి కానుకలను బయటకు తరలించినట్టు అంగీకరించారు. కానుకలను విక్రయించిన, కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.