శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:40 IST)

ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: ఎపి ఎన్జిఓ నేతలు

ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి త‌మ  డిమాండ్లను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఎపిఎన్జీఓ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆల్ ఇండియా స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాల ప్రాంగణంలో ఎపిఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఏపిఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో సాచివేత ధోరణిని అవలంబించడం సరికాదన్నారు.

ఎన్నికల హామీతోపాటు మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకు వస్తానని గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదన్నారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించి వారిలో ఉత్సాహాన్ని నింపారని ఉద్యోగులు కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్నేహపూర్వకమైన వాతావరణంలో తమ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించబడతాయని ఆశించారన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయన్నారు. 11వ నివేదిక సమర్పించేందుకు పిఆర్ సికి మొదట రిటైర్డు ఐఏఎస్ అధికారి టక్కర్ ఆధ్వర్యంలో కమిటీని వేశారని తరువాత మంత్రులతో ఇంకొక కమిటీని ఉన్నతస్థాయి అధికారులతో మరో కమిటీ అంటూ ప్రభుత్వం పిఆర్ సి అమలులో తీవ్రమైన జాప్యం చేస్తోందన్నారు.

ఈ తరహా చర్యలను ఉద్యోగులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి వారిలో ఉత్సాహాన్ని నింపితే మరింత సమర్థవంతంగా విధులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారన్నారు. 

ఉద్యోగ సంఘాల అమరావతి జెఏసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రధాన లక్ష్యమని వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చారన్నారు.

ఎన్నికలలో గెలుపొంది అధికారం చేపట్టాక ఆయా ప్రభుత్వాలు ఉద్యోగులను పూర్తిగా విస్మరించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల ఉద్యోగులలలో ఇప్పటికే అభద్రతాభావం ఏర్పడిందని ఇది తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వాలు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లు సహేతుకమైనవన్నారు. ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకొకసారి పెరిగిన ధరలకనుగుణంగా ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ ద్వారా జీతభత్యాలను నిర్ధారించడం అనాదిగా ప్రక్రియేనన్నారు.

ప్రభుత్వం ధరలను నియంత్రిస్తే తమకు కరువు భత్యం మంజూరుచేయవలసిన ఆవశ్యకతే ఉ ండదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ బహిరంగ మార్కెట్లో పతాకస్థాయికి చేరుకుంటున్నాయన్నారు.

ఈ పరిస్థితుల్లో పిఆర్ సిని అమలుచేసి బకాయి ఉన్న డిఏలను మంజూరుచేయకపోతే ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని ఇది ప్రభుత్వాలకు ఎంతమాత్రం సహేతుకం కాదన్నారు.

సిపిఎస్ విధానాన్ని రద్దుచేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం, నాలుగవ తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 60 నుండి 62 సంవత్సరాలకు పెంచడం, హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలుచేయడం వంటి ప్రధాన డిమాండ్లుతోపాటు ఇతర డిమాండ్ల పరిష్కారంపై తక్షణమే స్పందించాలని కోరుతున్నామన్నారు.

కార్యక్రమంలో ఎపిఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్రనేతలు కృపానందం, వసంతరావు, రత్నకుమారి జిల్లానేతలు ఎండి ఇక్బాల్, పి.రమేష్, సతీష్‌కుమార్, నగర నేతలు జె.స్వామి, సంపత్‌కుమార్, నజీరుద్దీన్ కేపిటల్ సిటీ నాయకులు రమణ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.