1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (17:52 IST)

గోల్డ్ మెడలిస్ట్ కాస్తా ఘరానా దొంగగా మారాడు.. ఎలాగంటే?

ఎంబీఏ చదివి, గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. అలాంటి వ్యక్తి కెరీర్ పరంగా గొప్ప స్థానంలో ఉంటారని ఎవరైనా అనుకుంటుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తప్పుదారి పట్టాడు. అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో గానీ చివరకు దొంగ అవతారమెత్తాడు.


అతడు చోటామోటా దొంగ కాదండోయ్.. ఘరానా దొంగ. అతడి పేరు మిక్కిలి వంశీకృష్ణ. గత కొన్నాళ్లుగా వంశీకృష్ణ దొంగతనాలకు పాల్పడుతున్నాడని సైబరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. ఈ క్రమంలోనే అతడి నేపథ్యం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
 
మిక్కిలి వంశీకృష్ణ ప్రకాశం జిల్లా వేటపాలెంకి చెందినవాడు. ఎంబీఏ వరకు చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆపై దొంగగా మారి చాలా సార్లు అరెస్ట్ అయ్యాడు. జైలు నుండి విడుదల కావడమే ఆలస్యం వెంటనే మరొక దొంగతనానికి ఉపక్రమిస్తాడు. ఇదే అతడికి ప్రవృత్తిగా మారింది. ఉదయం పూట రెక్కీ నిర్వహించి, రాత్రిళ్లు దోపిడీ చేసేవాడు. 
 
జంటనగరాల్లోని మూడు కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్‌లలో వంశీకృష్ణపై కేసులు ఉన్నాయి. మరోసారి ఘరానా దొంగ వంశీకృష్ణను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న 1 లక్ష 50 వేల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చదువులో గోల్డ్ మెడలిస్ట్‌ అయిన అతడు దొంగగా ఎందుకు మారాడో అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.