1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 ఆగస్టు 2021 (18:55 IST)

అక్రిడేషన్‌తో నిమిత్తం లేకుండా పాత్రికేయిలందరికీ హెల్త్ కార్డులు

అక్రిడిటేషన్‌తో నిమిత్తం లేకుండా పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయిల సంఘం వినతిపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గురువారం జర్నలిస్టు యూనియన్ నేతలతో కమీషనర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
 
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నపురెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా రమేష్‌లతో పాటు పలువురు యూనియన్ నేతలు కమీషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సవరించిన అక్రిడేషన్ నిబంధనల వల్ల పలువురు పాత్రికేయిలు అక్రిడేషన్ పొందలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో  పూర్వపు నిబంధనల మేరకు పాత్రికేయిలకు హెల్త్ కార్డులు ఇప్పించాలని అన్నపరెడ్డి కమీషనర్‌కు విన్నవించారు. గతంలో డస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉండేవి కాదని అయినా వారికి హెల్త్ కార్డులు మంజూరు చేసారని గుర్తు చేసారు.
 
ఈ క్రమంలో కనీసం పూర్వపు అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు మంజూరు అయ్యేలా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. నిజానికి హెల్త్ కార్డుల విషయంలో అక్రిడేషన్ తప్పనిసరన్న నిబంధన లేదని ఈ విషయాన్ని పరిశీలించాలని అన్నపరెడ్డి కోరారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ విన్నపంపై సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
 
అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్న నిబంధన ఉన్నట్లయితే దానిని సవరించి అర్హులు అందిరికీ ఆరోగ్య కార్డులు మంజూరు చేయించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం పాత్రికేయిల పట్ల పూర్తి సానుకూలంగా ఉందని, అయితే తాము నిబంధనలను పాటించాలనే చెబుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,000 అక్రిడేషన్లు మంజూరు చేసామని వివరించారు.
 
సచివాలయ పాత్రికేయిల సంఘం అధ్యక్షుడు రాజా రమేష్ పలు విషయాలను కమీషనర్ దృష్టికి తీసుకువస్తూ కరోనా మహమ్మారి పరిస్ధితులలో ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున కనీసం ఈ ఇబ్బందులు చక్కపడే వరకైనా ఆరోగ్య కార్డుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అర్హత కలిగిన ఛానల్స్ అన్నింటికీ అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు. కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా నూతన నిబంధనల వర్తింపు గురించి తాము చెబుతూనే ఉన్నామని కనీసం ముద్రాపకుని నుండి ముద్రణ నిర్ధారణ బిల్లు కూడా సమర్పించి కుండా అక్రిడేషన్ కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలన్న వ్యత్యాసం ఏమీ లేదని కేవలం నిబంధనను గురించి ప్రస్తావిస్తున్నామని కమీషనర్ వివరించారు.