విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న వరద పరిస్ధితిపై జలవనరులశాఖ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో 13 జిల్లాల నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, కృష్ణానది వరదతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల మీద వరద ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. దిగువ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అలెర్ట్‌గా ఉండాలన్నారు. మైనర్ ఇరిగేషన్ పరిధిలో ప్రాజెక్టులను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.... ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.