ఆనందయ్యకు తొలగిన అడ్డంకి : తక్షణమే కే ఔషధం పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామవాసి ఆయుర్వేద వైద్యుడు బొనిగె ఆనందయ్య కరోనా రోగు కోసం పపిణీ చేసే ఆయుర్వేద మందుల్లో 'కె' రకం ఔషధానికి కూడా ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది.
ఆనందయ్య ఇచ్చే 'కె' రకం మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇటీవల ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. 'కె' మందుకు కూడా నాడు అనుమతి ఇవ్వలేదు. తాజాగా వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 'కె' మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
మరోవైపు, ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు.
ఇప్పటికే కొవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌లోని మందు వాడాలని, కరోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్‌లోని మందు వాడాలని గోవర్ధన్‌రెడ్డి వివరించారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామని తెలిపారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని చెప్పారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని తెలిపారు.