శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (21:34 IST)

ఎన్టీఆర్ గృహ నిర్మాణం... ఏపీలో ఇళ్లు లేనివారికి సొంతిళ్లు...

అమరావతి: రాష్ట్రంలో పట్టణాల మాదిరిగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి, లబ్ధిదారులకు అందజేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. కుప్పం నియోజవర్గంలోని పలార్ల పల్లెలో ప

అమరావతి: రాష్ట్రంలో పట్టణాల మాదిరిగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి, లబ్ధిదారులకు అందజేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. కుప్పం నియోజవర్గంలోని పలార్ల పల్లెలో ప్రయోగాత్మకంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న బహుల అంతస్తుల నిర్మాణంలో 2 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించనున్నామన్నారు. గృహ నిర్మాణం పథకం కింద పట్టణాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు ఎటువంటి బిల్డింగ్ ప్లానింగ్ అవసరం లేకుండా ప్రభుత్వం త్వరలో జీవో తీసుకురానుందన్నారు. 
 
ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి 500 గజాల వరకూ అనుమతి ఉందన్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు 750 గజాల వరకూ ఇంటి నిర్మాణం చేపట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. అనుమతి లేకున్నా, 2014 తరవాత ప్రభుత్వంపై నమ్మకంతో ఇళ్లు నిర్మించుకున్న పేదలను కూడా ఆదుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. తమ దగ్గర ప్రస్తుతం లక్షా 50 వేల లబ్ధిదారులకు సంబంధించి జాబితా ఉందన్నారు. ఆ జాబితాలో ఉన్నవారి పేర్లను స్థానిక అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలిస్తారన్నారు. 
 
పూర్తయిన ఇళ్లకు రూ.95 వేలు చెల్లిస్తామని మంత్రి శ్రీనివాసులు తెలిపారు. అలాగే, ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను జియో ట్యాగింగ్ ఫొటోల ద్వారా గుర్తించి, బిల్లులు మంజూరు చేస్తామన్నారు. మండల స్థాయి అధికారులే కాకుండా, హౌసింగ్ డీఈ 20 శాతం ఇళ్లు, ఆర్డీవో 5 నుంచి 10 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు పరిశీలిస్తారన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు సర్టిఫికెట్ చేసిన తరవాత బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఎటువంటి అవకతవకలకూ తావే లేకుండా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ సాగుతుందన్నారు. వారే కాకుండా ఇంకెవరైనా ఉంటే వారినీ గుర్తించి, ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 
 
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో గ్రామీణ గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశం మంగళవారం జరిగిందన్నారు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని 10 లక్షల మంది సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో హౌసింగ్ అధికారులు పనిచేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా మూడు ప్రాముఖ్యమైన తేదీలను నిర్ణయించున్నామన్నారు. ఆయా తేదీల్లో సామూహిక గృహ నిర్మాణాలు చేపట్టాలని కార్యచరణ ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. 13 లక్షలా 6 వేలా 555 ఇళ్లను నిర్మించాలని  నిర్ణయించిందన్నారు. ఇందులో 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు 6 లక్షల ఇళ్లకు అనుమతులిచ్చారన్నారు. 
 
లక్షా 50 వేల రూపాయల యూనిట్ ఖర్చుతో 2016-17లో ప్రారంభమైన 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. వాటిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా నిర్మించామన్నారు. లక్షా 3 వేల అక్టోబర్ 2 తేదీనాటికి సామూహిక గృహ ప్రవేశాలు చేశామన్నారు. ఇప్పటి వరకూ(సోమవారం) లక్షా 39 వేల ఇళ్లు పూర్తి చేశామన్నారు. వచ్చే ఏడాది జనవరి 14 నాటికి 2 లక్షా 50 వేల ఇళ్లు, జూన్ 9 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీంతో పాటు 2019 జనవరి 14 నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.
 
పట్టణంలో ఇళ్ల నిర్మాణలకు బిల్డింగ్ అనుమతులు అవసరం లేదు...
పట్టణాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఎన్నో నిబంధనలు అడ్డుగా ఉన్నాయని మంత్రి శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో పేదల ఇళ్ల నిర్మాణాల్లో బిల్డింగ్ ప్లాన్ అనుమతులు అవసరం లేదని చెప్పిందన్నారు. దీన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. బిల్డింగ్ ప్లాన్ అనుమతులు లేకుండానే ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టొచ్చని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని మంత్రి తెలిపారు.
 
750 గజాల వరకూ ఇంటి నిర్మాణానికి అవకాశం...
ప్రస్తుతం ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 500 గజాల నుంచి 750 గజాల వరకూ ఇంటిని నిర్మించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. అలాగే, అన్నాదమ్ములు, బంధుల ఇళ్లు నిర్మాణంలో నిర్మించిన జాయింట్ గోడకు కూడా ప్రభుత్వం అనుమతిస్తూ, బిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో బహుళ అంతస్తులు...
పట్టణ ప్రాంతాల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి, పేదలకు అపార్టుమెంట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలోని కుప్పం నియోజకవర్గం పలార్లపల్లెలో ప్రయోగాత్మకంగా బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. రూ.100 కోట్ల వ్యయంతో జీ+3 పద్ధతిలో చేపట్టనున్న ఈ బహుళ అంతస్తులో 2 వేల మంది లబ్ధిదారులకు అపార్టుమెంట్లు ఇవ్వనున్నామన్నారు.

రూ.3 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, రూ.లక్షన్నర లబ్ధిదారులు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ బహుళ అంతస్తు నిర్మాణానికి రూ.90 కోట్లు, మౌలిక సదుపాయల కల్పనకు రూ.10 కోట్లు వెచ్చించనున్నామన్నారు. ప్రస్తుతం మండలం, గ్రామ పంచాయతీల్లోనూ స్థలాల ధరలు భారంగా మారాయన్నారు. ఈ పరిస్థితుల్లో భూసేకరణ వ్యయంతో కూడినదిగా మారిందన్నారు. గ్రామాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలతో పేదల అదరికీ సొంతిళ్లు కల్పించే అవకాశం ఉందన్నారు. 
 
అందరికీ సొంతిళ్లు కల్పిస్తాం...
రాష్ట్రంలో 20 లక్షల 99 వేల మంది ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా వివిధ గ్రామ సభల గుర్తించినట్లు మంత్రి శ్రీనివాసులు తెలిపారు. వారందరికీ సొంతిళ్లు కల్పించాలనే ఉద్దేశంతో లబ్ధిదారుల పేర్లను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆవాస్ సాఫ్ట్ లో నమోదు చేశామన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి తెలిపారు.
 
లంచాలు వసూలు చేస్తే కఠినచర్యలు...
ఇళ్ల నిర్మాణంలో భాగంగా లంచాల రూపంలో డబ్బులు వసూలు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. వసూలు చేసిన డబ్బులను తిరిగి పేదలకు అందిస్తామన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసినవారిలో గృహ నిర్మాణశాఖ అధికారులుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ, అక్టోబర్ 2 తేదీన ఒకేసారి లక్ష ఇళ్లల్లో సామూహిక ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి రికార్డు సృష్టించామన్నారు. ఇది హౌసింగ్ కార్పొరేషన్ ఘనత అని అన్నారు. సామూహిక ఇళ్ల నిర్మాణాలపై గిన్నీస్ రికార్డు కు పంపించామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి. కాంతిలాల్ దండే పాల్గొన్నారు.