శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (20:54 IST)

తిరుమల ASPపై చీటింగ్ కేసు- డమ్మీ డీఎస్పీని దించి రూ.1.2 కోట్లు మోసం..

సినీస్టైల్‌లో డమ్మీ డీఎస్పీని రంగంలోకి దించి.. హైదరాబాదుకు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో చిత్తూరు జిల్లా తిరుమల అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌) చీటింగ్‌ కేసు నమోదైంది. 
 
ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
 
మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్‌ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నరు. ఈ ఈయన స్నేహితుడైన కోడటి జయప్రతాప్‌ 2018 డిసెంబర్‌లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. 
 
రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ ఎం.ముని రామయ్య నమ్మబలికాడు. అవతలి వ్యక్తి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్‌ కుమార్‌ ప్రశ్నించారు. దీంతో ముని రామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. 
 
కేవీ రాజు అనే వ్యక్తిని తీసువచ్చి టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి అనేక ఎన్‌కౌంటర్లు చేశామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి నగదు ఇవ్వకపోతే అతడిని కనిపెట్టి, డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ చెప్పాడు. దీంతో రూ.1.2 కోట్లు ఇవ్వడానికి సునీల్‌ కుమార్‌ అంగీకరించారు.  
 
ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్‌కుమార్‌కు డబ్బు తిరిగి రాలేదు. దీంతో సునీల్‌కుమార్‌ ముని రామయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన కుమార్తె పేరుతో ఉన్న ఓ స్థలం పత్రాలు ఇచ్చిన ఆయన దానిపై రూ.2 కోట్లు రుణం తీసుకోవాలని చెప్పారు. 
 
అయితే వాటిని పరిశీలించిన బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటి నుంచి  ముని రామయ్య అందుబాటులోకి రాకపోవడంతో సునీల్‌కుమార్‌ అనుమానించారు. ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని తేలింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.