1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (16:19 IST)

నెల్లూరు జిల్లా నుంచే అది నేర్చుకున్నా: ఎస్ఈసీ నిమ్మగడ్డ కామెంట్స్

ఎన్నికల నిర్వహణకి పరిస్థితి అదుపులోకి రావడం సంతోషకరమన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకి ఇది సరైన సమయమని భావించి ఎన్నికలు నిర్వహిస్తున్నాం.
 
సుప్రింకోర్టు ఎన్నికలు జరుపుకోమంది. అందరూ కలిసి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలి. భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా గతంలో రెండు విడతలు జరిగే ఎన్నికలని, ప్రస్తుతం నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నాం. ఎన్నికలు నిజాయితీగా, నిబద్దతగా నిర్వహిస్తామని అందరూ చెబుతున్నారు. ఏకగ్రీవాలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోతున్నాయి. నాయకత్వం వహించాలని భావించే వారి సంఖ్య పెరుగుతుంది. ఒక్కో పంచాయతీలో అయిదారు మంది పోటీపడుతున్నారు.
 
బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమవుతుంది. ఎన్నికల వల్ల గ్రామాల్లో విభేదాలు వస్తాయనడం సరికాదు. పర్యావరణాన్ని కాపాడటం, బాలికా విద్య, మధ్యపాన నిషేదం వంటి వాటిలో గ్రామాలన్నీ ఒకే తాటిపై నిలబడ్డాయి. ట్రైనీ ఐఏఎస్‌గా నెల్లూరు జిల్లాలో పనిచేశా. నెల్లూరులో రాజకీయ నేతలు తప్పుని తప్పు అనేవారు. అలాంటి సంస్కృతిలో పెరుగుతూ వచ్చా.
 
నా జీవితంలో ఏ రాజకీయపార్టీ వైపు మొగ్గుచూపలేదు. నాది చిన్నపరిధి. నా పరిధి దాటి ఏనాడు ప్రవర్తించలేదు. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం నా బాధ్యత. రాజకీయపార్టీలన్నింటినీ గౌరవిస్తా. నెల్లూరు జిల్లా నుంచి అదే నేర్చుకున్నా అన్నారు.