అన్న క్యాంటీన్ల నోట్లో అడ్డంగా పచ్చి వెలక్కాయ్... మూతపడుతున్నాయ్...
ఒక ప్రభుత్వం వస్తే మరో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అటకెక్కుతాయి. వాటి స్థానంలో వేరేవి వచ్చి చేరుతాయి. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది. ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇవ్వాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోవడంతో వాటిని కాస్తా మెల్లిగా మూసేస్తున్నారు. వచ్చింది కొత్త ప్రభుత్వం, అది కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లకు బదులు వైఎస్సార్ క్యాంటీన్లయితే నిధులు వస్తాయేమో గానీ అన్న క్యాంటీన్లకు ఎలా వస్తాయన్నది సహజంగా తలెత్తే ప్రశ్నే.
ఇకపోతే రాష్ట్రంలో కేవలం రూ. 5కే చక్కటి భోజనం అందిస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవి సుమారు 200 దాకా వున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆహారాన్ని తయారుచేసి ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తుండేవి. కానీ ఎన్నికల నేపధ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. దీనితో సుమారు రూ. 45 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి వచ్చింది ప్రభుత్వం. ఈ నిధులను కొత్త ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్న.