మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:56 IST)

కవితల్లో ప‌ల్ల‌వించిన‌ పర్యావరణ పరిరక్షణ: మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్

పచ్చని వృక్షాలే ఈ భూమిని కవితా కావ్యంగా చేశాయని, పర్యావరణ పరిరక్షణ దిశగా కవులు తమ గొంతుక‌ వినిపించి స‌మాజాన్ని ఆలోచింప చేసార‌ని మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఆధ్వ‌‌ర్యంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన సంస్థ (నెల్లూరు), ఆంధ్రప్రదేశ్, తెలంగాణా భాష, సాంస్కృతిక శాఖల సంయుక్త‌ స‌హ‌కారంతో గ‌త రెండు రోజులుగా నిర్వహించిన  అంతర్జాతీయ అంతర్జాల బహుభాషా కవి సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి డాక్టర్ కొలకలూరి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇనాక్ మాట్లాడుతూ విధ్వంసానికి గురువుతున్న ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, క‌వులు ఈ క్ర‌మంలో త‌మ వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించాల‌న్నారు.
 
 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు, సీనియ‌ర్ ఐపిఎస్‌ అధికారి కిల్లాడ సత్యనారాయణ, కల్చరల్ సెంటర్ చైర్ పర్స‌న్‌ డాక్టర్ యార్ల‌గ‌డ్డ‌ తేజస్విని విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. వల్లభరావు మాట్లాడుతూ అవధులు లేని కవిత్వం అరిమరనికలు లేని ఆత్మీయతలను పెంచుతుందన్నారు.
 
ఈ స‌ద‌స్సు ద్వారా కవులు పర్యావరణ పరిరక్షణ కోసం తమ  గళాలను వినిపించటం ప్రశంసించదగ్గ విషయమన్నారు. యార్ల‌గ‌డ్డ‌ తేజస్విని మాట్లాడుతూ గత ఐదేళ్ళుగా భౌతికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనాలకు భిన్నంగా ఈసారి కరోనా వల్ల అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ పై సీసీవిఏ ఇచ్చిన పిలుపుకు ప్రపంచ వ్యాప్తంగా కవుల నుంచి విశేష స్పందన లభించిదని, వారి సూచనలు ఆచరణాత్మకంగా ఉన్నాయన్నారు.
కేంద్ర సంగీత, నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, కార్య‌క్ర‌మ క‌న్వీన‌ర్ డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ 32 దేశాల నుంచి 42 భాషల్లో మొత్తం 165 మంది కవులు తమ గొంతు వినిపించారని, ఈ సమ్మేళనాన్ని అంతర్జాల మాధ్యమాల ద్వారా ప్రపంచ దేశాల నుంచి పదివేలకు పైగా వీక్షించారని తెలిపారు. కల్చరల్ సెంటర్ సీఈఓ. మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పర్యవేక్షణలో సాగిన క‌వి స‌మ్మేళ‌నం ముగింపు కార్య‌క్ర‌మంలో మాలక్ష్మీ ప్రాపర్టీస్ సీఈఓ సందీప్ మండవ వందన సమర్పణ చేశారు. సెడిబస్ సీఈఓ దీపా బాలసుబ్రమణ్యయన్ అనుసంధాన కర్తగా వ్య‌వ‌హ‌రించిన‌ రెండు రోజుల సదస్సు సృజనాత్మక సాహిత్య వేదికగా నిలిచింది.