శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (08:13 IST)

పేదరికం కారణంగా ఆ చదువుకు దూరం కాకూడదనే.. ‘జగనన్న వసతి దీవెన’

విద్య అభ్యసించే ఏ ఒక్క పేద విద్యార్థి కూడా పేదరికం కారణంగా ఆ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మరో కార్యక్రమం ‘జగనన్న వసతి దీవెన’.

ఇప్పటికే ‘అమ్మ ఒడి’ పథకంలో ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుండగా, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు కూడా ఆర్థికంగా చేయూతనిస్తూ ‘జగనన్న వసతి దీవెన’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయనగరంలో సోమవారం ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తున్నారు.

విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించే ప్రక్రియలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం చేపడుతుండగా, విద్యార్థుల భోజనం, వసతి సౌకర్యాలు కింద ఆర్థిక సహాయం చేస్తూ, ‘జగనన్న వసతి దీవెన’ పథకం అమలు చేస్తున్నారు.
 
ఎక్కడి నుంచి ఈ ఆలోచన?
ప్రజల కష్టాలను స్వయంగా చూసి, వారిలో ఒక భరోసా కల్పించేందుకు నాడు విపక్షనేతగా కొనసాగించిన సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పేదరికంలో ఉన్న ఏ విద్యార్థి కూడా  విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో ‘జగనన్న వసతి దీవెన’ పథకం అమలు చేస్తున్నారు.
 
ఎలాంటి ఫలితం?
జగనన్న వసతి దీవెన పథకం వల్ల  విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గే వీలుంది. 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండి, ఇంటర్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన ‘గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో’ (జీఈఆర్‌) కేవలం 23 శాతం మాత్రమే ఉండడం దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ పరిస్థితి మార్చాలన్న సంకల్పంతోనే సీఎం వైయస్‌ జగన్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
 
ఏయే విద్యార్థులకు ఎంతెంత?
జగనన్న వసతి దీవెన పథకంలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద చెల్లిస్తారు.
 
స్మార్ట్‌ కార్డులు
ఇందుకోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్‌ బార్‌ కోడ్‌తో కూడిన స్మార్డ్‌ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈనెల 25వ తేదీ నుంచి గ్రామ వలంటీర్లు ఆ కార్డులను అర్హులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేస్తారు.
 
పథకం–అర్హతలు
ఈ పథకంలో ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా  ఆదాయ పరిమితి నిబంధనలు కూడా సవరించారు. కుటుంబ వార్షిక ఆదాయం  రూ.2.5 లక్షల వరకు  ఉన్న ప్రతి విద్యార్థికీ జగనన్న వసతి దీవెన పథకం వర్తింప చేస్తున్నారు. 
 
 ఎంత మందికి?
జగనన్న విద్యా దీవెనతో పాటు, జగనన్న వసతి దీవెన పథకాల కోసం వైయస్సార్‌ నవశకం సర్వే ద్వారా అర్హులను గుర్తించారు. గత ఏడాది నవంబరులో 11,27,437 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా, వారిలో 10,85,218 మంది విద్యార్థులు ఈ రెండు పథకాలకు అర్హులని తేల్చారు. సర్వే సమయంలో కొత్తగా 69,085 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలోనూ అర్హులను గుర్తించారు.
 
ఈ నేపథ్యంలో ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పథకాల కోసం రాష్ట్రంలో 11,54,303 మంది విద్యార్థులు అర్హులని తేలింది. అయితే స్పందనలో వస్తున్న దరఖాస్తులు, అనర్హులుగా గుర్తించిన వారి అభ్యంతరాలు, గ్రామ సచివాలయాల్లో వలంటీర్ల సర్వే.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరం ‘జగనన్న వసతి దీవెన’ పథకంలో ఇప్పుడు 11,87,904 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
 
పూర్తి పారదర్శకంగా
జగనన్న వసతి దీవెన పథకంలో అర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగింది. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, సామాజిక సర్వే ద్వారా అర్హులను గుర్తించారు. అర్హుడైన ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం కలగకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే అర్హులైన విద్యార్థుల ఎంపికను పూర్తి పారదర్శకంగా కొనసాగించారు. ఇంకా అర్హులైన విద్యార్థులు ఎవరైనా మిగిలిపోతే వారికీ అవకాశం కల్పిస్తారు. 
 
ఎవరి ఖాతాల్లోకి సహాయం?
అమ్మ ఒడి పథకం మాదిరిగానే జగనన్న వసతి దీవెన పథకంలో కూడా విద్యార్థులకు చేసే ఆర్థిక సహాయాన్ని వారి తల్లుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రెండు విడతల్లో ఆ మేరకు నగదు జమ చేస్తారు. పథకం ప్రారంభించిన వెంటనే ఆర్థిక సహాయంలో సగం, పథకంలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కానుంది.
 
ఎంత వ్యయం?
జగనన్న వసతి దీవెన పథకం కోసం మొత్తం రూ.2278 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. 
 
ఏ విద్యార్థులు ఎందరు?
జగనన్న వసతి దీవెన పథకం తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు, 86,896 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులకు.. డిగ్రీ, పీజీ విద్యార్థులు మరో 10,47,288 మందికి ఆర్థిక సహాయం అందనుంది.
 
ఇప్పుడు ఎంతెంత?
ఐటీఐ విద్యార్థులకు తొలి విడతగా రూ.5 వేల చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1139.15 కోట్లు వారి వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
జిల్లాలు–విద్యార్థులు
జగనన్న వసతి దీవెన పథకంలో లబ్ధి పొందనున్న విద్యార్థుల్లో అత్యధిక, అత్యల్ప సంఖ్యను జిల్లాల వారీగా చూస్తే..
ఐటీఐ విద్యార్థుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 6828, ఆ తర్వాత విశాఖ జిల్లాలో 6802 మంది ఉండగా, అత్యల్పంగా నెల్లూరులో 2057, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 2627 మంది విద్యార్థులు ఉన్నారు.
 
పాలిటెక్నిక్‌ విద్యార్థులు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 14,903, ఆ తర్వాత విశాఖ జిల్లాలో 12,197 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2826, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 3334 మంది విద్యార్థులున్నారు. 
ఇక డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,22,219, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 1,08,139 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51,373, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 52,944 మంది విద్యార్థులు ఉన్నారు. 
 
విద్యార్థుల పరంగా..
ఇంకా విద్యార్థుల పరంగా చూస్తే.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,31,899 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 57,270 మంది విద్యార్థులు ఇప్పుడు ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా లబ్ధి పొందనున్నారు.

ఇక జిల్లాల వారీగా.. విజయనగరంలో 59,688, విశాఖలో 1,05,709, తూర్పు గోదావరిలో 1,23,938, పశ్చిమ గోదావరిలో 86,816, కృష్ణాలో 1,19,197, గుంటూరులో 1,19,618, ప్రకాశంలో 70,128,  నెల్లూరులో 67,541, అనంతపురంలో 85,041,   వైయస్సార్‌ కడపలో 78,595,  కర్నూలులో 82,464 మంది విద్యార్థులు ‘జగనన్న వసతి దీవెన’ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు.