మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (19:21 IST)

మడమ తిప్పని సీఎం జగన్మోహన్ రెడ్డి : పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లైనా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ములు ఇంకా చెల్లించలేదన్నారు. 
 
రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ.4 వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు 28 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కేంద్రం నుంచి అందిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించేశారని, ఇప్పుడు రైతులు డబ్బులు అడుగుతుంటే కేంద్రం నుంచి రూ.3 వేల కోట్లు రావాలని మంత్రులు చెబుతుండడం దారుణమని మండిపడింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కూడా ప్రభుత్వం ఇలానే డబ్బులు చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు. 
 
అప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించిందని పార్టీ గుర్తు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బకాయిలను చెల్లించాలని, లేదంటే జనసేన పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించింది.
 
ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడు మాట మార్చారని జనసేన ఆరోపించింది. మడమ తిప్పడం అంటే ఏమిటో ముఖ్యమంత్రి తన చేతల్లో చూపిస్తున్నారని ఎద్దేవా చేసింది. జగన్ తీసుకొస్తానన్న రాజన్న రాజ్యం ఇదేనా అని ప్రశ్నించింది. 
 
రైతుల కళ్లలో నీళ్లు తెప్పించడమే మీ విధానమా? అని నిలదీసింది. రబీ ధాన్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి పాలకులు గురవుతారని జనసేన హెచ్చరించింది.