గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (10:46 IST)

జనసేన పార్టీకి భారీ షాకిచ్చిన ఎన్నికల సంఘం ...

glass tumbler
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ గ్లాజు గుర్తును లాగేసుకుంది. దీన్ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా జనసేన పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు... ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నిల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సివుంది. దీంతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అపుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
 
అయితే, గత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 9 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. పైగా, గతంలో బద్వేల్, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు.