బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (11:34 IST)

వంగి వంగి నమస్కారం పెట్టి చుక్కలు చూపించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిప‌త్రి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎట్ట‌కేల‌కు త‌న వినూత్న నిర‌స‌న‌ను విర‌మించారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న మున్సిప‌ల్ కార్యాల‌యంలోనే స్నానం, పానం చేస్తూ, ఇంటికి కూడా వెళ్ళ‌కుండా అధికారుల రాక కోసం వెయిట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న నిర‌స‌న‌తో దిగివ‌చ్చిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్రసాద రెడ్డి, జేసీని క‌లిసి దీక్ష విర‌మించాల‌ని కోరారు. దీనితో స‌మీక్ష స‌మావేశానికి రావ‌డానికి ప్ర‌భాక‌ర్ రెడ్డి అంగీక‌రించారు.
 
గ‌త కొద్ది రోజులుగా తాడిప‌త్రిలో విచిత్ర‌మైన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి కోవిడ్ పై ర్యాలీ నిర్వ‌హిస్తూ, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద రెడ్డిని ఇందులో పాల్గొనాల‌ని ఒత్తిడి చేశారు. అదే స‌మ‌యానికి మున్సిప‌ల్ స‌మీక్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. దీనితో ఎటు వెళ్లాలో తేల్చుకోలేక మున్సిప‌ల్ సిబ్బంది ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్య‌క్రమానికే హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రాక‌పోవ‌డంతో చిర్రెత్తిన ప్ర‌భాక‌ర్ రెడ్డి.. కార్పొరేష‌న్లో చిందులు తొక్కారు. అధికారులు తాను పిలిస్తే రారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, కార్పొరేష‌న్ కార్యాల‌యంలోనే ప‌డుకున్నారు. 
 
ఒక‌రిద్ద‌రు మున్సిప‌ల్ ఉద్యోగులు ఎమ్మెల్యే కార్య‌క్ర‌మం అయిన త‌ర్వాత మున్సిపాలిటీకి వ‌స్తే, వారికి ఒంగి ఒంగి దండాలు పెడుతూ, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న ఆగ్ర‌హాన్ని వినూత్నంగా ప్ర‌ద‌ర్శించారు. ఇక దీనితో గ‌డ‌గ‌డ‌లాడిపోయిన మున్సిప‌ల్ సిబ్బంది, ఈ సమ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని అయోమ‌యంలో ప‌డిపోయారు. చివ‌రికి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌చ్చి ఛైర్మ‌న్‌తో క‌ల‌వ‌డంతో సమ‌స్య ఒక కొలిక్కి వ‌చ్చింది.
 
తాను అధికారుల‌ను ఎక్కువ స‌మ‌యం ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని దిగివ‌చ్చాన‌ని ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చెపుతున్నారు. ఎమ్మెల్యే మున్సిపాలిటీలో ఒక ఎక్స్‌అఫీషియో మెంబ‌ర్ మాత్ర‌మేన‌ని... ఆయ‌న ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు.