శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (16:12 IST)

మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ.. రూ.10 లక్షల సాయం

వైయస్‌ఆర్ కడప జిల్లా కలసపాడు మండల, మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 1 పరిధిలో జరిగిన బ్లాస్టింగ్ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు 5 ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. 
 
కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్‌ సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్‌ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని మంత్రి తెలిపారు. ఈ బ్లాస్టింగ్ ఘటనలో పదిమంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతిచెందిన వారికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధి నుంచి తక్షణం రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.అయిదు లక్షల పరిహారంను అందచేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 
 
ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఈ ఘటనపై వచ్చిన వివరాల ప్రకారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందచేశారని తెలిపారు. లీజు దారు అజాగ్రత్త వల్లనే ఈ ప్రేలుడు సంభవించినదని, లేబర్ డిపార్టుమెంటు నష్ట పరిహర చట్టం 1923 ప్రకారం మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజు దారు నుంచి నష్టపరిహారంను కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 
 
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మైనింగ్ నియమావళిని ఉల్లంఘించకుండా లీజుదారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. అలాగే నిబంధనలను పాటించని లీజుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీజుదారు నిర్లక్ష్యం వల్లే వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో ఈ ఈ దుర్ఘటనకు జరిగిందన్నారు. 
 
వైయస్‌ఆర్ కడప జిల్లా కలసపాడు మండల, మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వే సంఖ్య 1 మరియు 133ల లోని సి. కస్తూరిబాయికి చెందిన మైనింగ్ లీజులో శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ప్రేలుడు జరిగి 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిన వెంటనే మైనింగ్ అధికారులు అప్రమత్తమయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 
 
గనులు మరియు భూగర్భశాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, ఉప సంచాలకులు ఎం. బాలాజీ నాయక్, కడప అసిస్టెంట్ డైరెక్టర్ డి. రవి ప్రసాద్, రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్, ఇతర మైనింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని తెలిపారు. ప్రేలుడు జరిగిన ప్రదేశం సర్వే నెంబర్ 1 లో ఉత్తర భాగంలో అనగా మైనింగ్ లీజు పరిధిలో వుందని గుర్తించినట్లు తెలిపారు. 
 
మామిళ్లపల్లె గ్రామంలో సర్వే సంఖ్య 1 మరియు 133 లలో బెరైటీస్ ఖనిజo వెలికితీసేందుకు 30.696 హెక్టార్ల విస్తీర్ణములో సి. కస్తూరిబాయి 02.11.2001 నుండి 01.11.2021 వరకు క్వారీ లీజుకు అనుమతి పొందారని తెలిపారు. అయితే లీజుదారు కస్తూరిబాయి ఈ భూమిలో మైనింగ్ నిర్వహణ కార్యకలాపాలకు సి. నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తికి జిపిఎ హోల్డర్ గా 31.12.2013న అనుమతి ఇచ్చారని వెల్లడించారు. 
 
మైనింగ్ లీజు నిర్వహణలో భాగంగా ప్రేలుడు పదార్థాల రవాణా, అన్ లోడింగ్ విషయములో జరిగిన అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదము జరిగినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తోందని అన్నారు. ఈ మేరకు మైనింగ్ లీజు జిపిఎ హోల్డర్ సి. నాగేశ్వరరెడ్డి పైన కలసపాడు మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నంబరు 58/2021 dt. 08.05.2021 ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టారని తెలిపారు.