ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్నా వారికి సిగ్గులేదు : కొడాలి నాని
ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వారికి ఏమాత్రం సిగ్గు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని గురువారం కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక 420 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు.. ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని చంద్రబాబును ఉద్దేశించిన ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటుతో పాటు టీడీపీ పార్టీని కూడా లాక్కున్నాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వాళ్లంతా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారన కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ తరహాలో పౌరుషం ఉన్న వ్యక్తి ఒక్క హరికృష్ణ మాత్రమేనని అన్నారు. అలాగే, ఎన్టీఆర్‌లా సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువన్నారు. అందుకే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుంటారని కొడాలి నాని విమర్శించారు.