గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:52 IST)

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్లు శ్రీ వెంక‌టాచ‌ల‌ప‌తి, శ్రీ వెంక‌టేశ‌య్య‌, ఆలయ అర్చకులు శ్రీ రఘ‌వాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
వాహన సేవలు:
తేదీ                                   ఉదయం                                సాయంత్రం
 
21-04-2021(బుధ‌వారం) ధ్వజారోహణం(మిథున‌లగ్నం)     శేష వాహనం
 
22-04-2021(గురువారం)     వేణుగానాలంకారము               హంస వాహనం
 
23-04-2021(శుక్ర‌వారం)      వటపత్రశాయి అలంకారము   సింహ వాహనం
 
24-04-2021(శ‌నివారం)      నవనీత కృష్ణాలంకారము          హనుమత్సేవ
 
25-04-2021(బుధవారం) మోహినీ అలంకారము                 గరుడసేవ
 
26-04-2021(ఆదివారం)      శివధనుర్భంగాలంకారము    కళ్యాణోత్సవము/ గజవాహనము
 
27-04-2021(సోమ‌వారం)        రథోత్సవం                           -----------
 
28-04-2021(మంగ‌ళ‌వారం) కాళీయమర్ధనాలంకారము       అశ్వవాహనం
 
29-04-2021(బుధ‌వారం)        చక్రస్నానం                           ధ్వజావరోహణం.
 
ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.