ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు మృతి
ప్రముఖ కమ్యూనిస్టు నేత కొల్లి నాగేశ్వరరావు (83) గురువారం విజయవాడ మాచవరం సమీపంలో ఆయన స్వగృహంలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శిగా 80వ దశకంలోనూ ఆయన బాధ్యతలు నిర్వహించారు.
విద్యార్థి, యువజన, రైతు సంఘాల్లో కొల్లి నాగేశ్వరరావు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు... పోరాటంలోనూ ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆలిండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షునిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన రోజుల్లో దేశ వ్యాప్తంగా రైతుల పోరాటంతో పాటు నీటి పారుదల ప్రాజెక్టుల కోసం కొల్లి నాగేశ్వరరావు అనేక పరిశోధనలు చేసి వాటిని ప్రభుత్వానికి అందజేశారు.
గడచిన కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన భార్య టానియా విజయవాడ ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేశారు. వీరి ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం వైద్య రంగంలో ఉన్నారు. రాజకీయ, సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ వారి రెండో అల్లుడు కావడం గమనార్హం.
నేటి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులకు ఆయన చేపట్టిన ఉద్యమాలు, కార్యాచరణ స్ఫూర్తిదాయకమని ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు నేతలు కొనియాడారు. కాగా.. కొల్లి నాగేశ్వరరావు మరణవార్త తెలియగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు జల్లీ విల్సన్, హరనాథ్‌రెడ్డి, రావుల వెంకయ్య, అక్కినేని వనజ పలువురు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి ఎర్ర జెండా కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నేత మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడానికి కారణం కొల్లి నాగేశ్వరరావు అని ఆయన ప్రేరణతోనే కమ్యూనిస్టు పార్టీలో నేటికీ కొనసాగుతున్నామని పేర్కొంటూ కొల్లి సేవలను గుర్తు చేసుకుని ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.
కాగా... రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పస్య పద్మ, మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, రైతు సంఘాల సమాఖ్య నాయకులు ఎర్నేని నాగేంద్రనాధ్, అక్కినేని భవానీప్రసాద్ తదితరులు కొల్లి నాగేశ్వరరావు మృతి పట్ల ఒక ప్రకటనలో తమ సంతాపాన్ని తెలిపారు.
కొల్లి నాగేశ్వరరావు భౌతికకాయాన్ని పార్టీ శ్రేణుల సందర్శనార్థం చుట్టుగుంటలోని విశాలాంధ్ర పత్రిక ఆవరణలో ఉంచి అనంతరం శుక్రవారం అంతిమ యాత్ర నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ తెలిపారు.