శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (09:16 IST)

వ్యాక్సిన్ 2వ డోస్ వేసుకున్న అంగన్‌వాడీ హెల్పర్ మృతి.. మరొకరికి సీరియస్!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న హెల్త్ వర్కర్లలో పలువురు చనిపోతున్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న అనంతరం అంగన్‌వాడీ హెల్పర్‌ మృతిచెందడం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. 
 
మృతురాలి భర్త తస్లీమ్‌ ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. విజయవాడలో కానూరు తులసీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్‌గా పనిచేస్తున్న గుల్‌షద్‌ బేగం (32) గత నెల 18న తొలిడోసు, ఈ నెల 24న రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకుంది. 
 
అప్పటినుంచి ఆయాసం, తలనొప్పితో బాధపడుతోంది. శనివారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. అంగన్‌వాడీ హెల్పర్‌ మృతి విషయం తెలుసుకున్న ప్రతిపక్ష, వామపక్ష నేతలు బాధితురాలి ఇంటివద్ద ఆందోళన చేపట్టారు. 
 
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కే పార్థసారథి అక్కడకు చేరుకుని మృతురాలి కుటుంబానికి తనసొంత నిధుల నుంచి రూ.50 వేలు, కానూరు మాజీ సర్పంచ్‌ నిధుల నుంచి రూ.50 వేల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
 
మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటి నుంచి తీవ్ర అనారోగ్యం పాలైన అంగన్‌వాడీ టీచర్‌ వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కలికివాయికి చెందిన నల్లూరి సునీత గతనెల 20న వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 
 
ఆ తర్వాత వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానికంగా చికిత్స తీసుకున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.