1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (20:17 IST)

నరసారావు పేట అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. వివిధ రకాలుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. అయితే, అధికార వైకాపా పార్టీ నేతలు మాత్రం తమ రూటే సెపరేటు అంటున్నారు. కరోనా కష్టాల్లోనూ వినోదం ఉండి తీరాల్సిందేనంటున్నారు. ఇందుకోసం పోలీసుల అనుమతి లేకుండా, రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో వున్నప్పటికీ అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ చేయించారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం, మద్దూరు పంచాయతీ మజరా పెంచికలపల్లిలో ఈ తంతు జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశిలీస్తే, పెంచికలపల్లి గ్రామంలో వినోదం కోసం రూ.60 వేలు చెల్లించి నరసరావుపేట నుంచి ఆరుగురు యువతులను పిలిపించారు. అమ్మవారి ఆలయం సమీపపంలో మంగళవారం రాత్రి 10 గంటలకు రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. కొందరు వైసీపీ నాయకులు డ్యాన్సర్లతో కలిసి నృత్యం చేశారు. 
 
రికార్డింగ్‌ డాన్స్‌ చూసేందుకు మద్దూరు, కృష్ణానగర్‌, గుంతకందాల తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చారు. కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేశారు. రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. కానీ అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారని తెలుస్తోంది. పైగా ఓ కీలకశాఖకు చెందిన అధికారి వీరికి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
పెంచికలపల్లిలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు జరుగుతున్నాయని ఆత్మకూరు డీఎస్పీ వై.శృతికి మంగళవారం రాత్రి 11.30 గంటలకు సమాచారం వెళ్లింది. వెంటనే ఆమె స్పందించారు. నేరుగా పెంచికలపల్లికి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ స్టేజ్‌ వద్దకు డీఎస్పీ చేరుకోగానే డ్యాన్సర్లు, నిర్వాహకులతో సహా జనం పరుగులు తీశారు. 
 
డీఎస్పీ అక్కడికి చేరుకున్న అరగంట తర్వాత పాములపాడు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ గ్రామానికి వచ్చారు. గ్రామంలో పర్యటించి అనుమతి లేకుండా రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులను, నరసరావుపేట నుంచి వచ్చిన డ్యాన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిర్వాహకులను పాములపాడు పోలీసుస్టేషన్‌లో ఉంచి డ్యాన్సర్లను ఆత్మకూరులోని ఓ లాడ్జిలో ఉంచారు. పాములపాడు ఎస్‌ఐని ఆత్మకూరులోని తన కార్యాలయానికి బుధవారం పిలిపించి మందలించినట్లు సమాచారం. డ్యాన్సర్లకు గట్టివార్నింగ్‌ ఇచ్చి పంపించనున్నట్లు తెలుస్తోంది.
 
కొవిడ్‌ సమయంలో అనుమతి లేకుండా రికార్డింగ్‌ డ్యాన్స్‌లను ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును నుంచి వైసీపీ నాయకులను తప్పించేందుకు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.