శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (20:13 IST)

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు: సీఎం జగన్‌

అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో చెత్త సేకరణకు 1.20కోట్ల చెత్తబుట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి కావాలని, 45వేలకు పైగా ఇళ్లు మూడు నెలల్లోగా.. మిగిలిన ఇళ్లు డిసెంబరులోగా అప్పగించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 
 
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్‌ సమీక్షించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘క్లాప్‌’ కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. మున్సిపాలిటీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్ల మరమ్మతును ప్రాధాన్యతగా చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీని వల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వస్తుందన్నారు. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందన్నారు.

దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్నారు. వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా సీఎం సమీక్షించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రేనేజీ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షించారు. బీచ్‌కారిడార్, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్, నేచురల్‌ హిస్టరీ పార్క్,  మ్యూజియం, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టులపైనా సమీక్షించిన సీఎం.. పనులు వేగంగా చేయాలని ఆదేశాలిచ్చారు.