ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:59 IST)

ఇంగ్లిష్‌ మీడియం అమలు చేసి తీరతాం: మంత్రి అనిల్‌ కుమార్‌

ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేసి తీరతామని ఎపి మంత్రి అనిల్‌ కుమార్‌ ప్రకటించారు. రాబోయే 20 ఏళ్లలో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తయారుచేస్తామని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుంటే టిడిపి నేతలకు ఆనందంగా ఉందని, పేదలకు ఉన్నత విద్యను అందించాలని సిఎం జగన్‌ తపన పడుతుంటే ఎలా అడ్డుకోవాలా అని టిడిపి నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

టిడిపి నేతలు, పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 'చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను అమెరికాలో చదివించుకోవచ్చా? మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో ఎందుకు చేర్పించలేదు? మీకో న్యాయం, పేదలకు మరో న్యాయమా?' అని అనిల్‌ అన్నారు.

ఎంపి విజయసాయిరెడ్డి వేసిన మూడు ప్రశ్నలకు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానం చెప్పాలని మంత్రి సవాలు విసిరారు. వాస్తవానికి నిమ్మగడ్డ పేరుతో రాసిన లేఖ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర డ్రాప్ట్‌ చేశారని, ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయంతో తానే లేఖ రాశానని రమేశ్‌ ఒప్పుకున్నారని అనిల్‌ ఆరోపించారు.

చంద్రబాబుకు వయసు మళ్లింది కాబట్టి ఇంట్లో ఉంటే తప్పులేదని, పక్క రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేయడం సరికాదని అనిల్‌ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తుంటే హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనిల్‌ విమర్శించారు.

లోకేశ్‌ ఎక్కడున్నారు? కరోనా సమయంలో టిడిపి నేతలు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. ఒక్కరికైనా బయటికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేయాలనిపించలేదా? అని అనిల్‌ నిలదీశారు.