సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:17 IST)

లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగమార్పిడి.. వ్యక్తి మృతి

ఏపీ నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరులోని ఓ లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగమార్పిడి ఆపరేషన్ చేసిన ఈ ఘటన విషాదంగా మిగిలింది. లింగ మార్పిడి ఆపరేషన్‌లో భాగంగా మర్మాంగాన్ని తొలగించిన తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి ఓ వ్యక్తి మరణించాడు. 
 
వివరాల్లోకి వెళితే, ఏపీ నుంచి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన బి శ్రీకాంత్ అలియాస్ అమూల్య చిన్నప్పుడే చదువుకు స్వస్తి చెప్పి తాపీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిన అతనికి 2019లో మేనమామ కుమార్తెతో వివాహం చేశారు. 
 
అయితే వివాహమైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏడాదికే వారు విడిపోయారు. చిన్నప్పటి నుండి అతనిలో ఆడ లక్షణాలు ఉండేవి. దీంతో భార్య అతడి నుండి విడిపోయింది. 
 
ఆ సమయంలో వైజాగ్ కు చెందిన ట్రాన్స్‌జెండర్ మోనాలిసాతో శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కోసం లింగమార్పిడి చేసుకోవాలనుకున్నాడు. 
 
ముంబైలో ఆపరేషన్ చేసుకోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అని, తాము అతి తక్కువ మొత్తానికి ఆపరేషన్ చేస్తామని మస్తాన్, జీవా శ్రీకాంత్‌కు చెప్పినట్టు సమాచారం. దీంతో వారి మాట నమ్మిన శ్రీకాంత్ ఆపరేషన్‌కు సిద్ధమై నెల్లూరు వెళ్ళాడు.
 
నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓ లాడ్జిలో ఈనెల 23వ తేదీన మస్తాన్, జీవా, మోనాలిసా, శ్రీకాంత్ ఒక రూమ్ తీసుకున్నారు. 24న ఆపరేషన్ చేసి శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించారు.
 
మర్మాంగాన్ని తొలగించిన వెంటనే శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమైంది. మర్మాంగాన్ని తొలగించిన కొద్దిసేపటికే పల్స్ రేటు పడిపోయింది. వారు ఆ సమయంలో శ్రీకాంత్‌ను కాపాడలేకపోయారు. దీంతో శ్రీకాంత్ ప్రాణాలు విడిచాడు. 
 
లాడ్జి గదిలో శ్రీకాంత్ మరణించిన విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరి పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.