ముగ్గురు పిల్లల తండ్రి... ఆ యువతిని కూడా పెళ్లి చేసుకుంటానని భార్యకు చెప్పీ...

అతడికి అప్పటికే వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో పెళ్లి చేసుకుని భర్తకు దూరంగా ఉన్న ఓ మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పాతమంగళగిరి సీతారామస్వామి కోవెల ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేసమయంలో ఓ యువతికి వివాహమై గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. పాతమంగళగిరిలోని పుట్టింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్యనారాయణ ఇంట్లో తెలిసింది.

ఆ యువతిని కూడా తాను వివాహం చేసుకుంటానని అతడు భార్యకు చెప్పాడు. ఆ సమాధానం విని భార్య ఖంగుతింది. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు భర్త. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సత్యనారాయణ, ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి శనివారం మధ్యాహ్నం మంగళగిరి కొండపై పానకాల స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ విషం సేవించేందుకు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆమె చేతిలోని గ్లాసును విసిరికొట్టి, సీసాలోని విషాన్ని తాగేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లేలోపే... ఆ యువతి తండ్రి అక్కడికి చేరుకుని ఇద్దరినీ ద్విచక్రవాహనంపై కొండ దిగువన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :