1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:10 IST)

మండలి ఇప్పట్లో రద్దయ్యేలా లేదు... ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర హోంశాఖకు పంపించింది. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లారు. మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా లేదు.
 
దీంతో సీఎం జగన్ ఇతర ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మండలిలో వైసీపీకి మెజార్టీ లేనందున... కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది. 
 
అలాగే, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైవున్నట్టు వినికిడి. మొత్తంమీద తాను అనుకున్న పనిని సాధించేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం.