1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (17:56 IST)

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రుల కలలను సాకారం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత శ్రీ పొట్టి శ్రీరాములును ఈరోజు స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను కలిగి ఉందని అవతరణ దినోత్సవం నేపధ్యంలో గవర్నర్ ప్రస్తుతించారు. మన నిర్మాణ శైలి, చిత్రలేఖనం పురాతన కాలం నుండే గుర్తింపు పొంది దినదిన ప్రవర్ధమానమవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ వివరించారు.
 
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆక్రమించి, అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అయితే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా, అర్హులైన ఏ వ్యక్తిని వదిలిపెట్టకుండా ఉండేలా చూడాలన్నారు.
 
ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని, పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.