బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (16:43 IST)

మ‌న బ‌డి నాడు-నేడు చూసి... మాట్లాడే ధైర్యం ప‌ప్పుకు ఉందా?

ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌య‌వంతంగా సాగుతున్న‌ నాడు-నేడు కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పాఠశాలలను చూసి మాట్లాడే ధైర్యం పప్పుకు ఉందా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్ర‌తిదానికీ త‌గుదున‌మ్మా అని ముందుకొస్తున్న నారా లోకేష్ నాడు-నేడు అభివృద్ధిపై మాట్లాడాల‌ని రోజా స‌వాలు చేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పుదుపేటలో నాడు నేడు పథకం కింద 48 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు నేడు ద్వారా అభివృద్ధి పరిచిన పాఠశాలలను ప్రారంభించడం కాకుండా, పిల్లలకు విద్యా కానుకలు కూడా అమలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇప్పుడున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన వసతులను నాణ్యమైన చదువును చూస్తుంటే, ఇప్పుడు నేను ఎందుకు పుట్టలేదా అని చాలా బాధ పడుతున్నానని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

తాను భాకరాపేట లో 7 నుంచి 10 తరగతులు చదివిన సమయంలోని పరిస్థితులను ఆమె వివరించారు. అన్ని దానాల కంటే విద్యా దానం గొప్పది కాబట్టి మంచి విద్యను అందిస్తే ఆ బిడ్డ ఆర్థికంగా, సమాజంలో గౌరవంగా నిలదొక్కుకునే అవకాశం ఉందని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు బిడ్డలకు మేనమామ లాగా ఇన్ని వసతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలంటే చిన్నతనంగా భావించే పరిస్థితులు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లితండ్రులు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తుందని వివరించారు. కార్పొరేట్ విద్యను కామన్ మెన్ దగ్గరికి తీసుకువచ్చిన చరిత్రకారుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించారు. విద్యా రంగానికి ఒక సంవత్సరానికి 730 కోట్లు కేటాయించినపుడే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడానికి, బురదజల్లడానికి ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు 300 కోట్లు మాత్రమే విద్యకు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15,715 పాఠశాలల్లో మొదటి దశలో ఆధునీకరించడానికి 3,500 కోట్లు వినియోగించారని వివరించారు. ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

తాము సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలతో మంచి ఉద్యోగాలు సాధించి జగనన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడుకు లేని మంచి మనసు జగన్ మోహన్ రెడ్డి కి ఉందని, రెండు సంవత్సరాల్లో చెప్పని కార్యక్రమాలు కూడా చేపట్టారని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు ఫేక్ సీఎం అని విమర్శించారని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఫేట్ ని మార్చే సీఎం అని అన్నారు.