శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (17:48 IST)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఝలక్ - నలుగురు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్

ysrcp mla's
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంచుపర్తి అనురాధ ఏకంగా 23 ఓట్లతో గెలుపొందారు. వైకాపాకు చెందిన నలుురు ఎమ్మెల్యేలు ఈ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వీరిపై వైకాపా అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోస్తా జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. ఈ నలుగురిని సస్పెండ్ చేస్తూ వైకాపా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. 
 
దీనిపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికీ రూ.15 కోట్లు చొప్పున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఆరోపించారు. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమేనని చెప్పారు. రోగ కారణాన్ని తక్షణం గుర్తించి ఇలాంటి వాటిని తొలగించుకోవాలని, అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధిష్టానంపై విశ్వాసం లేనపుడు పార్టీలో ఉంచడం అనవసరమనే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. పైగా, కేవలం అసంతృప్తి వల్లే పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.