మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (10:15 IST)

జూన్ 5న అరేబియాలో అల్పపీడనం.. రాష్ట్రానికి నైరుతి ఆలస్యం

rain
ఈ యేడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా రానున్నాయి. జూన్ 5వ తేదీన అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలోకి మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సాధారణంగా జూన్ ఐదో తేదీ నాటికి రాయలసీమ, పదో తేదీ నాటికి ఉత్తర కోస్తాలో ప్రవేశించాల్సివుంది. కానీ, అరేబియా సముద్రంలో జూన్ 5వ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. కానీ, ప్రస్తుతం కేరళ పరిసరాల్లో వర్షాలు కురుస్తుండటం, అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడంతో జూన్ రెండు, మూడు తేదీల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశముందని కొన్ని అంతర్జాతీయ సంస్థల వెల్లడిస్తున్నాయి. జూన్ 5వ తేదీన ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం. బలపడి వాయవ్య దిశగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 
 
నేడు కోస్తా, సీమల్లో వర్షాలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.