కడపకు చేరుకున్న నారా లోకేశ్.. ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుగా ప్రటించినట్టుగా మంగళవారం కడప పర్యటనకు వచ్చారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ప్రవీణ్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అలాగే, వివిధ కేసుల్లో అరెస్టు అయి ఇదే జైలులో ఉన్న మరో 17 మంది పార్టీ నేతలను పరామర్శించి, వారితో ములాఖత్ నిర్వహిస్తారు.
జిల్లాకు నారా లోకేశ్ వస్తున్నవార్తను తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన కడప సెంట్రల్ జైలుకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు.
ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్ తో పాటు మరో 17 మంది నేతలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మరోవైపు, నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.