బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (11:11 IST)

రాహుల్ హ‌త్య కేసులో మ‌రో కోణం - డైరెక్ట‌ర్ కిర‌ణ్ బొబ్బా ఎక్క‌డ‌?

విజ‌య‌వాడ‌లో పారిశ్రామిక వేత్త రాహుల్ హ‌త్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. జి.కొండూరులోని చెరువు మాధ‌వ‌రంలో జ‌డ్.ఎక్స్.ఎన్. గ్యాస్ సిలిండ‌ర్ల ఫ్యాక్ట‌రీ లావాదేవీలు ఈ హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌ణం కాగా, ఇందులో రాహుల్ పార్టన‌ర్ కోరాడ విజ‌య్ కుమార్ ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న్ని ఏ-1 గా కేసు పెట్టారు. ఆ ఫ్యాక్ట‌రీని త‌క్కువ ధ‌ర‌కు కొనాల‌ని స్కెచ్ వేసిన కోగంటి స‌త్యంను రెండో ముద్దాయిగా ఏ-2 గా కేసు న‌మోదు చేశారు. అయితే, ఇదే  జ‌డ్.ఎక్స్.ఎన్. గ్యాస్ సిలిండ‌ర్ల ఫ్యాక్ట‌రీలో మూడో పార్ట‌న‌ర్, మ‌రో డైరెక్ట‌ర్ ఏమ‌య్యార‌నేది మిస్ట‌రీగా మారింది. 
 
రాహుల్ హత్య కేసులో కనిపించని మరో డైరెక్టర్ స్వామి కిరణ్ బొబ్బ ఆచూకీ లేదు. ఈ కంపెనీకి ముగ్గురు డైరెక్టర్లు ఉంటే, ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది అనడం కేసుని తప్పుదారి పట్టించ‌డ‌మే అంటున్నారు స్థానికులు. విజయపథంలో వందల కోట్ల స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రముఖ చమురు కంపెనీలకు సిలెండర్స్ సరఫరా చేస్తూ, రాయలసీమలో మరో ఫ్యాక్టరీ ప్రారంభించిన తరుణంలో రాహుల్ కు ఒక  యువతిని ఎర‌ వేసి పధకం ప్రకారం హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఏడాది పై నుంచే ఈ హ‌త్య‌కు పధకం వేస్తున్న‌ట్లు, హైదరాబాద్ లో రాంప్రసాద్ హత్య జరిగిన సమయంలోనే రాహుల్ హత్యకు పధకం జరిగింద‌ని అనుమానిస్తున్నారు. దీనికి యువతిని పావుగా వాడి ఆమె ఇంటికి సమీపంలోకి రాహుల్ ని  నమ్మకంగా పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంత జ‌రుగుతుండ‌గా, ఫ్యాక్ట‌రీలో మరో డైరెక్ట‌ర్ పాత్ర ఏంటి అనేది ఇపుడు మీమాంశ‌గా మారింది.